శ్లోకం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శ్లోకం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, జూన్ 2011, బుధవారం

గణేశ శ్లోకం: గజాననం భూత గణాధి - తాత్పర్యం

వెలగ పళ్ళు, రేగు పళ్ళు
 గణేశ శ్లోకం:
గజాననం భూత గణాధి సేవితమ్ 
కపిత్థ జంబూ ఫల సార భక్షితమ్
ఉమా సుతం శోక వినాశ కారణమ్
నమామి విఘ్నేశ్వర పాద పంకజమ్ 

ప్రతి పదార్ధం: గజ = ఏనుగు; ఆననం = ముఖము; భూత గణాది = భూత గణములు మొదలయిన; సేవితం = సేవించబడు; కపిత్థ = వెలగ; జంబూ = రేగు; ఫల = పండు/పళ్ళు; సార = గుజ్జు; భక్షితం = తినువాడు; ఉమ = పార్వతి; సుతం = పుత్రుడు/కొడుకు; శోక = దుఃఖం; వినాశ = నశింప జేయు; కారణం = కారణమైన వాడు; నమామి = నమస్కరింతును; విఘ్నేశ్వర = విఘ్నములకు అధిపతియైన వినాయకుని; పాద = పాదములు / చరణములు; పంక = బురద; జ = పుట్టినది; పంకజం = బురదలో పుట్టినది = కమలము/పద్మము. 

తాత్పర్యం:  గజ ముఖుడు, భూత గణములచే సేవించ బడే వాడు, వెలగ మరియు రేగు పండ్ల గుజ్జును భక్షించు వాడు, పార్వతీ పుత్రుడు, దుఃఖమును నశింప జేయుటకు కారణమైన వాడు అయిన విఘ్నేశ్వరుని పాద పద్మములకు నమస్కరిస్తున్నాను. 

25, మే 2011, బుధవారం

గణానాం త్వా గణపతి గమ్ -తాత్పర్యం

 
గణానామ్ త్వా గణపతిగ్‍ం హవామహే
కవిమ్ కవీనా ముపమశ్రవస్తవమ్
జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆన శ్శృణ్వ న్నూతిభి స్సీద సాదనమ్

ప్రతి పదార్ధం: గణానామ్=భూత గణములకు; త్వా=నిన్ను; గణపతిగ్‍ం= గణపతివి; హవామహే=ఆహ్వానించుచున్నాము; కవిమ్=కవివి; కవీనామ్=కవులలో; ఉపమ=పోలిక; అశ్రవస్తమమ్=మిక్కిలి అధికుడవు; జ్యేష్ఠ రాజమ్=రాజాధిరాజువు; బ్రహ్మణామ్=బ్రహ్మణ్యులలో; బ్రహ్మణస్పతే =గొప్ప బ్రహ్మణ్యుడవు; ఆ=అయిన; నః=మాకు; శృణ్వన్=ఆలకించి; ఊతిభిః=కోర్కెలు తీర్చువాడవై ; సీద=అలంకరించుము;సాదనమ్=ఆసనము/స్థానము.

తాత్పర్యం: భూత గణములకు అధిపతివి, విద్వాంసులలో విద్వాంసుడవు, పోల్చదగిన కీర్తి శ్రేష్టులకు కూడా నీవే పోలికవు, బ్రహ్మణ్యులలో బ్రహ్మణ్యుడవు, సర్వ జగత్తుకు అధిపతివి (రాజాది రాజువు), అయిన నిన్ను మా కోర్కెలు తీర్చుటకు, మా ప్రార్థన ఆలకించి ఈ పూజా సమయము నందు ఈ స్థానమును లేక ఆసనమును అలంకరించుము.   

11, మే 2011, బుధవారం

శ్రీ రామ శ్లోకం - ఆపదామప హర్తారం

శ్రీరాముడు
 కష్టాలను గట్టెక్కించే కరుణామూర్తి, మనకు వచ్చిన ఆపదలను తొలగించి శాంతిని సుఖాన్ని ప్రసాదించే పరంధాముడు ఆ శ్రీరాముడు. సుఖ, శాంతులు, ఆయురారోగ్యాలే కదా ఆయన మనకిచ్చే సంపదలు. ఆపత్కాలంలో ఈ శ్లోకాన్ని జపిస్తే అన్ని బాధలు తొలగిపోతాయని అందరి నమ్మకం. అటువంటి మహిమాన్వితుడైన సుందర రామునికి ఎల్లప్పుడూ తలచుకుంటాం. అదే ఈ శ్రీ రామ శ్లోకం.

ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపద
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ 

ప్రతి పదార్ధం: ఆపదాం* = ఆపదలను; అపహర్తారం = పోగొట్టువాడు; దాతారం = ఇచ్చువాడు; సర్వ = అన్ని; సంపదాం = సంపదలను / సిరులను; లోకం  = లోకములో; అభిరామం = అందమైన వాడు; శ్రీరామం = శ్రీరాముని; భూయో భూయో (భూయః + భూయః) = మాటి మాటికి / పదే పదే; నమామ్యహం = నమామి + అహం;  అహం = నేను; నమామి = నమస్కరిస్తున్నాను.

తాత్పర్యం: ఆపదలను పోగొట్టువాడు, అన్ని సంపదలను ఇచ్చువాడు, లోకములో అతి సుందరమైన వాడైనట్టి శ్రీ రామచంద్రునికి మాటి మాటికి నమస్కరిస్తున్నాను.

*ఆపః = నీరు; దం = ఇచ్చేది; నీటిని అంటే ఈ సందర్భంలో కన్నీటిని ఇచ్చేది అనగా ఆపదలను కలిగించేది అనే అర్ధం ఉండవచ్చు. ఇది కేవలం నా ఊహ మాత్రమే.

9, మే 2011, సోమవారం

ప్రథమ దేవతా స్తుతి

గణేశ ప్రార్థన లేనిదే ఏ కార్యం మొదలెట్టం కదా! ఆఖరికి విష్ణు సహస్ర నామం ప్రారంభం కూడా వినాయకుని స్తుతితో మొదలవుతుంది. నా ఈ కొత్త బ్లాగును కూడా గణేషుని స్తుతితో ప్రారంభిస్తున్నాను. వీలైనంత వరకు సంస్కృత  శ్లోకాలకు అర్ధం వివరిస్తూ భక్తికి సంబంధించిన విషయాలను నలుగురితో పంచుకోవాలనే ఓ చిన్న తపన - సూర్య నారాయణ వులిమిరి. 

విఘ్నేశ్వరుడు
   
గణేశ స్తుతి:
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం 
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే 

ప్రతి పదార్ధం: శుక్ల = తెల్లని; అంబర = వస్త్రం (ఆకాశం అని కూడా మరొక అర్థం); ధరం = ధరించిన వాడు; శశి = చంద్రుని; వర్ణం = రంగు గల; చతుర్ = నాలుగు; భుజం = భుజములు / బాహువులు; ప్రసన్న = సంతుష్టమైన; వదనం = ముఖము; ధ్యాయేత్ = ధ్యానింతును; సర్వ = అన్ని; విఘ్న = అడ్డంకులు; ఉపశాన్తయే = ఉపశమించుటకు / తొలిగి పోవుటకు.  

తాత్పర్యం: తెల్లని వస్త్రములు ధరించినవాడు, సర్వవ్యాపకుడు, చంద్రుని వంటి కాంతి గలవాడు, నాలుగు భుజములు గలవాడు, సంతుష్ట మైన ముఖము కలవాడు అయిన గణపతిని అన్ని అడ్డంకులు తొలగింప జేయుటకై ప్రార్థిస్తున్నాను.