లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం
ప్రతి పదార్ధం: లక్ష్మీం = విష్ణు పత్నియైన శ్రీ మహాలక్ష్మి; క్షీర సముద్ర రాజ = పాలసముద్రమునకు రాజు; తనయాం = కుమార్తె; శ్రీ రంగ = శ్రీ రంగంలోని శ్రీ రంగనాధుని/నాయకుని; ధామ = గృహము (గుడి); ఈశ్వరి = నాయిక /అధిపతి; దాసీభూత = దాస దాసీ జనులు /సేవకులు; సమస్త = అందరు; దేవ = దేవ సంబంధమైన / దేవతా; వనితాం = స్త్రీలు; లోకైక = లోకములో ఒకే ఒక / ఉన్నతమైన; దీప = జ్యోతి; అంకురం = మొలక; దీపాంకురాం = ప్రకాశము నిచ్చే చిరు జ్యోతి / చిరు దివ్వె; శ్రీమన్ = శ్రీమంతు రాలైన లక్ష్మీ దేవి; మంద = చల్లని/నెమ్మదైన; కటాక్ష = చూపులచే; లబ్ధ = పొందిన; విభవత్ = వైభవము; బ్రహ్మ = సృష్టి కర్తయైన బ్రహ్మ; ఇంద్ర = దేవతల రాజైన ఇంద్రుడు; గంగాధరాం = గంగను ధరించిన వాడు (శివుడు); త్వాం = నిన్ను; త్రై = మూడు; లోక్య = లోకములకు; కుటుంబిణీం = పరివారమైన; సరసిజాం = సరసులోని పద్మము నుండి పుట్టిన (లక్ష్మి); వందే = నీకు నమస్సులు; ముకుంద = విష్ణువు; ప్రియాం = ఇష్టమైన.
తాత్పర్యం: లక్ష్మీ దేవీ! పాల సముద్రపు రాజు కూతురవై, శ్రీరంగధామమునకు అధిపతివై, దాస దాసీ జనులను, సమస్త దేవతా స్త్రీలను, లోకములన్నింటిని ప్రకాశింప జేయు దీప జ్యోతివి నీవు. బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు మొదలయిన వారు కూడ శ్రీమంతురాలగు నీ చల్లని చూపులచే వైభవమును పొందిరి. ముల్లోకములు నీ కుటుంబమే. పద్మములో పుట్టిన, విష్ణువుకు ఇష్ట సఖివైన ఓ! లక్ష్మీ దేవీ, నీకు నమస్కారములు.
నమస్కారం సూర్యనారాయణ గారు. చాలా చక్కగా వివరించారండి. మా తెలుగు తరగతి పిల్లలకు ఈ శ్లోకం చెప్పాలనుకుంటున్నాము. ఈ శ్లోకం గురించి గూగుల్ లో వెతికితే మీ బ్లాగుకు తీసుకొచ్చింది. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిజ్యోతిర్మయి గారూ, మీ స్పందనకు, నా బ్లాగు దర్శించినందుకు ధన్యవాదాలు. మీ తెలుగు తరగతికి ఉపయోగపడినందుకు సంతోషంగా వుంది.
తొలగించండి