సూచిక

30, జనవరి 2012, సోమవారం

సూర్య జయంతి శుభాకాంక్షలు

రథ సప్తమి శుభాకాంక్షలు
కర సంక్రాంతికి సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశిస్తాడు. ఏడు గుర్రాల రథములో మొదలయిన ఆయన ప్రయాణం మాఘ మాసం, శుక్ల పక్షం లో ఏడవ తిథి అయిన సప్తమినాడు ఉత్తరాభిముఖమై సూర్య రథ చక్రాలు ఈశాన్య పరంగా తిరుగుతాయి. ఈ దినాన సూర్యుడు కశ్యప మహర్షి-అత్రిల పుత్రుడుగా జన్మించాడు. అందువలన ఈ రోజే సూర్య జయంతి. దీనినే రథసప్తమి అని అంటారు. ఈ సంవత్సరం (2012) మనకు రథసప్తమి జనవరి 30 వ తారీఖున పడింది.  

ఈ రోజు ప్రాతః కాలాన్నే సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి ఆ సూర్యదేవుని పూజిస్తారు. ఆంద్ర ప్రదేశ్ లో శ్రీకాకుళం సమీపాన గల అరసవిల్లి (హర్షవిల్లి) సూర్యనారాయణ దేవాలయంలో ఈ రోజు ఎంతో ఉత్సాహంతో భక్తులు సూర్యదేవుని కొలుస్తారు. ఈ దేవాలయం విశిష్టత ఏమిటంటే సంవత్సరంలో రెండు మార్లు, ఆరు మాసాల వ్యవధిలో సూర్య కిరణాలు నేరుగా స్వామివారి పాదాలపైన కొద్ది క్షణాలు మాత్రమె పడతాయి. ఈ అద్భుతం చూడటానికి పలు ప్రాంతాల నుండి భక్తులు వేల సంఖ్యలో వస్తారు.
సూర్య దేవుని స్మరిస్తూ నవగ్రహ స్తోత్రంలోని ఈ శ్లోకాన్ని పారాయణం చేస్తే మనకు మేలు కలుగుతుందని, ఆయురారోగ్యాలు లభిస్తాయని  భక్తుల విశ్వాసం.

సూర్య శ్లోకం 
జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం 
తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం 

ప్రతి పదార్ధం: జపాకుసుమం = మందార పువ్వు; సంకాశం = ఒప్పియుండు, వలె నుండు; కాశ్యపేయం = కశ్యపుని తనయుడు; మహా = మిక్కిలి; ద్యుతిం = కాంతి వంతమైన; తమోరిం = తమః + అరిం; తమః = చీకటి, తమస్సు; అరిం = శత్రువును; సర్వ = అన్ని; పాపఘ్నం = పాపములను దహించువాడు; ప్రణతోస్మి = నమస్కారము, ప్రణామము; దివాకరం = సూర్యునికి.

తాత్పర్యం: మందార పువ్వు వంటి ఎర్రని రంగు గలవాడు, కశ్యప ప్రజాపతి పుత్రుడు, మిక్కిలి కాంతివంతమైన వాడు, చీకటికి శత్రువు, సమస్త పాపములను దహింప జేయువాడు అయిన సూర్యునకు నమస్కారం.  
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి