సూచిక

13, మే 2011, శుక్రవారం

మంగళ శ్లోకం - సర్వ మంగళ మాంగళ్యే (గూగుల్ సమస్య వలన తిరిగి చేస్తున్న పోస్టు)




సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే

ప్రతి పదార్థము: సర్వమంగళ మాంగళ్యే = శుభకరమైన వాటన్నింట శుభకరమైనది /మంగళకరమైనది (సర్వమంగళ నామము చేత మంగళ స్వరూపురాలైనది); శివే = శివ సతి అయిన శక్తి లేదా పార్వతి; సర్వ = అన్ని; అర్థ = అర్థములను (ధర్మ+అర్థ+కామ+మోక్ష అను చతుర్విధ పురుషార్థములు); సాధికే = సాధించినది; శరణ్యే = శరణము/ఆశ్రయము కల్పించేది; త్రంబకి = త్రి + అంబకి = మూడు కన్నులు గలవాని దేవేరి, అనగా పార్వతి; దేవి = దేవి/దేవత; *నారాయణి = పార్వతి; తే = నీకు; నమః = నమస్కారము/ప్రణామము; అస్తు = అగు గాక.   

తాత్పర్యము: మంగళ కరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై, సర్వ మంగళ నామధేయురాలవై, అన్ని అర్థములను సాధించి, శరణు జొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే, ముక్కంటి దేవర అయిన శివుని అర్ధాంగి అయిన ఓ! పార్వతీ, ఓ! దుర్గాదేవీ, ఓ! నారాయణీ, నీకు నమస్కరిస్తున్నాను.

* నారాయణి అర్ధం లక్ష్మీ దేవా లేక పార్వతా అని మొదట చేసిన పోస్టులో ఒకరు ప్రశ్నించారు. వారికి ధన్యవాదాలు. ఈ సందేహము నాకు కూడ కలిగిందండి. త్రయంబకుడు అంటే మూడు కన్నులు గలవాడైన శివుడు. శివుని స్తుతించే "మహా మృత్యుంజయ మంత్రం" లో "ఓం త్రయంబకం యజామహే" అని నుతిస్తాము. అందువలన "త్రయంబకి" పార్వతి అవ్వాలి. అలాగే "శివే" అన్న సంబోధన కూడ పార్వతిని సూచిస్తుంది. అంతే కాకుండా ఈ శ్లోకంలో కొందరు "దేవి" బదులుగా "గౌరి" అని వ్రాయడం చూసాను. అయితే ఇందులో దేవి ని కేవలం పార్వతి గా కాకుండ "శక్తి" రూపంగా అభివర్ణించవచ్చును. ఈ శక్తి రూపం వాణి, గౌరి, లక్ష్మిల సంగమం. అంతే కాకుండా శక్తి ని దుర్గ, ఉమ, చండి రూపాలతో కూడ తలుస్తారు, కొలుస్తారు. అయితే సందర్భానుసారంగా "నారాయణి" ని పార్వతి గా అనుకోవాలి అని నా అభిప్రాయం. అయితే నారాయణి కి మరొక అర్ధం ఉన్నదేమో తెలియదు. ఇలాంటి సందేహం "వరవీణా మృదుపాణి" వర్ణంలో కూడ కలుగుతుంది. ఈ వర్ణం లో నేనెప్పుడూ ఇది సరస్వతీ దేవి స్తుతి అనుకునేవాడిని వీణ ప్రస్తావన ఉంది కనుక.  కాని ఈవిడను "వరదాప్రియ రంగనాయకి" అంటాం. అంటే రంగనాథుని సతి అయిన శ్రీ మహా లక్ష్మి.  మీకు, నాకు ఒకే సందేహం ఉంది "నారాయణి" గురించి. అయితే అది పూర్తిగా నివృత్తి కాలేదు నాకు కూడ. ఇంకెవరైనా దీని పై వివరణ ఇవ్వగలరేమో చూద్దాం.  

10 కామెంట్‌లు:

  1. నారాయణి శబ్దానికి శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు ఇచ్చిన అర్థాలు ...
    1. లక్ష్మి, 2. దుర్గ, 3. శక్తి, 4. ఋశ్యప్రోక్త, చల్లగడ్డ (వృక్షవిశేషం), 5. (సంగీతంలో) ఒకానొక స్త్రీరాగం.

    రిప్లయితొలగించండి
  2. శంకరయ్య గారికి నమస్కారములు. నా (మా) సందేహాన్ని నివృత్తిచేసినందుకు ధన్యవాదాలు. మీ సూచన అమూల్యమైనది.

    రిప్లయితొలగించండి
  3. ధన్యవాదాలు, ఆ సందేహం నాదే. ప్రశ్నకు ఒళ్ళుమండి, పోస్టే లాగేశారేమో అని కించిత్ ఆశ్చర్య పడ్డా అందులో నా తప్పేమైయుంటుందా అని! :)
    నారాయణి అనేది లక్ష్మి, శక్తిలకు కూడా వాడేయవచ్చంటారు.

    రిప్లయితొలగించండి
  4. Snkr గారు, నమస్కారం. గత రెండురోజుల క్రితం గూగుల్ వాళ్ళు సర్వర్ మార్చే ప్రయత్నంలో ఆ రోజు చేసిన పోస్టులు గల్లంతయ్యాయి. ఎప్పటికీ మీ వ్యాఖ్య వల్లకాదు. బహుశ ఈ పాటికి మీరు గ్రహించియుంటారు. నాకు తెలుగు సంస్కృతాలంటే చాల అభిమానం. కాని వాటిలో పండితుడిని కాదు. నాకు తెలిసినది చాల స్వల్పం. అయితే తెలియనివి తెలుసుకోవాలని, తెలుసుకున్నవి నలుగురితో పంచుకోవాలనే తపన. మీ సూచనలకు సర్వదా కృతజ్ఞుడ్ని. ముందు ముందు మీ సుహృద్భావాన్ని కొనసాగిస్తారని ఆశిస్తాను. నమస్సులు.

    రిప్లయితొలగించండి
  5. చాగంటి గారి కథనం ప్రకారం, నారాయణి అంటే నారాయణుడి సోదరి, భార్య కాదు.

    రిప్లయితొలగించండి
  6. మలక్, అంటే 'ని'కారాంతం చేస్తే సోదరి అనే అర్థం వస్తుందా? లేదా అదొక్క పదమే అలా వుందా? శివాని అంటే లక్ష్మి అవుతుందా? బ్రాహ్మణి అంటే ఎవరు?

    రిప్లయితొలగించండి
  7. నారాయణి శబ్ద వివేచన గురించి.
    ఇప్పుడే సంస్కృతాంధ్ర నిఘంటువు చూసానండి. అందులో నారాయణః శబ్దానికి పుం.లిం.అర్థంలో విష్ణువు, అశ్వత్థ వృక్షము, శివుడు,మత్స్యము, బ్రహ్మ, చంద్రుడు,సముద్రము,సూర్యుడు,వెలగ చెట్టు, జామ చెట్టు అని అర్థాలు రాసారు.
    నారాయణీ స్త్రీలింగం(సంస్కృతంలో స్త్రీలింగ పదాలు దీర్ఘాంతాలుగా ఉంటాయి) పదానికి పార్వతి, వెన్నెల,సరస్వతి, గంగ, పిల్లిపీచర అనే అర్ధాలు ఇచ్చారు.
    ఇక్కడ శివుడి భార్యగా పార్వతిని నారాయణి అని భావించాలి. మరి లక్ష్మి అనే అర్థం ఇవ్వనేలేదెందుకనో. అలాగే బ్రహ్మ భార్యగా సరస్వతిని కూడా నారాయణిగా భావించవచ్చు. వెన్నెలని చంద్రుడి భార్యగా అనుకోవాలేమో ఆ అర్ధానికి. సముద్రుడి భార్యగా గంగ కికూడా ఆ నారాయణి అర్థం వర్తిస్తోంది.
    ఇతర నిఘంటువులు మాత్రం నారాయణి పదానికి పార్వతి,లక్ష్మి పదాలు అర్థాలుగా ఇచ్చాయి. అంతే కాదు బ్రహ్మ భార్యగా బ్రహ్మణి అంటే సరస్వతి అని, బ్రాహ్మణుడి భార్య అంటే బ్రాహ్మణి అనే అర్ధాలు ఇచ్చాయి. అలాగే శర్వుడు అంటే శివుడు కనుక శర్వాణి అంటే పార్వతి అయింది.
    మొత్తానికి తెలుసుకున్నదేమంటే ఆ అణి అనే ప్రత్యయం భార్య అనే అర్థం వచ్చినప్పుడు వస్తోందని.

    రిప్లయితొలగించండి
  8. మలక్ గారు, ధన్యవాదాలు. నేను కూడ నారాయణి అంటే నారాయణుని సోదరి అని ఎవరిద్వారానో విన్నాను.
    శంకర్ గారు, ధన్యవాదాలు. సుధ గారు మీరు పరిశోధించి విపులంగా వ్రాసినందుకు కృతజ్ఞతలు. అందరి అభిప్రాయాలు విన్న తరువాత నారాయణి శక్తి రూపిణి అని చెప్పవచ్చు. మీ అందరి సూచనలకు నెనర్లు.

    రిప్లయితొలగించండి
  9. Narayani ante Sakshath Parvathi Devi. Narayani ante wife of Narayana kadu. Sister of Narayana
    please get confirmed.

    రిప్లయితొలగించండి
  10. శాస్త్రి గారికి ధన్యవాదాలు ఈ సందేహనివృత్తి చేసినందుకు.

    రిప్లయితొలగించండి