సూచిక

16, మే 2011, సోమవారం

మహా మృత్యుంజయ మంత్రం : తాత్పర్యం

 మహా మృత్యుంజయ మంత్రం:
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం 
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్  ముక్షీయ మామృతాత్ 

ప్రతి పదార్ధం: ఓం = ఓంకారము, శ్లోకమునకు గాని, మంత్రము నాకు గాని ముందు పలికే ప్రణవ నాదము;  త్రయంబకం = మూడు కన్నులు గలవాడు; యజామహే = పూజించు చున్నాము; సుగంధిం = సుగంధ భరితుడు; పుష్టి = పోషణ నిచ్చి పెరుగుదలకు తోడ్పడు శక్తి ; వర్ధనం = అధికము / పెరుగునట్లు చేయువాడు / పెంపొందించు వాడు; ఉర్వారుకం = దోస పండు; ఇవ = వలె; బంధనాత్ = బంధమును తొలగించు;  మృత్యోర్  = మృత్యువు నుండి; అమృతాత్ = అమృతత్వము కొరకు / అమరత్వము కొరకు; మాం = నన్ను; ముక్షీయ = విడిపించు.

తాత్పర్యం:  అందరికి శక్తి నొసగే ముక్కంటి దేవుడు, సుగంధ భరితుడు అయిన పరమ శివుని నేను (మేము) పూజించు చున్నాము. ఆయన దోస పండును తొడిమ నుండి వేరు చేసినటుల (అంత సునాయాసముగా లేక తేలికగా) నన్ను (మమ్ము) అమరత్వము కొరకు మృత్యు బంధనము నుండి విడిపించు గాక!

ప్రాశస్త్యము: మనకు ఉన్న, తెలిసిన మంత్రాలలో గాయత్రి మంత్రం వలె ఈ "మహా మృత్యుంజయ మంత్రం" పరమ పవిత్రమైనది, అతి ప్రాచుర్యమైనది. క్షీర సాగర మథనం లో జనించిన హాలాహలాన్ని రుద్రుడు లేదా పరమ శివుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు. ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులగుదురు అని పలువురి నమ్మకం. ఇది ఒక విధమైన మృత-సంజీవని మంత్రం అని చెప్ప వచ్చు. అంతేకాక ఆపదలు కలిగినపుడు కూడా దీనిని చదువుకో వచ్చును. సాధారణంగా ముమ్మారు గాని, తొమ్మిది మార్లు గాని, లేదా త్రిగుణమైన సంఖ్య లెక్ఖన దీనిని పారాయణం చేస్తారు.

ఓం నమః శివాయ!  

4 కామెంట్‌లు:

  1. సూర్యనారాయణగారూ, ఒక మంచి మంత్రాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. అయితే, గురువుద్వారా ఉపదేశంలేకుండా మంత్ర జపం చేయకూడదంటుంటారుకదా... దీనిమీద మీ అభిప్రాయం చెప్పగలరా.

    ఈ మంత్రంలో...ఉర్వారుకమివ తర్వాత వచ్చే పదాన్ని బంధనాన్ అని చదవాలా లేక బంధనాత్ అని చదవాలా?

    కృతజ్ఞ‌తాభినందనలతో...

    రిప్లయితొలగించండి
  2. తేజస్వి గారు, మీ స్పందనకు, అభినందనకు ధన్యవాదాలు. నాకు తెలిసి మృత్యుంజయ మంత్రానికి పట్టింపులు ఉన్నాయనుకోను. అయితే గాయత్రి మంత్రం మాత్రం గురు ముఖత నేర్చుకోవాలని పురాణ ప్రవచనాలు చేసే మహానుభావులు చెప్పగా విన్నాను. అంతేకాక గాయత్రి మంత్రాన్ని రింగు టొనులలో పెట్టుకోకూడదని వారి నుండే విన్నాను.
    తరువాత విషయంకొస్తే, "బంధనాన్" "బంధనాత్" రెండూ ఒకటే. సౌలభ్యం కోసం సంధి విభజన చేయడం వలన "బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్" అని వ్రాసాను. నిజానికి అందులో వున్న పదాలు "బంధనః + మృత్యుః + ముక్షీయ + మాం + అమృతాత్" అని వ్రాయాలి. సంధి కలసినపుడు కొన్ని ధాతువులు రూపాంతరం చెందుతాయి. సంధి కలిపి వ్రాస్తే "బంధనాన్మృత్యోర్ముక్షీయ మామృతాత్" అని వ్రాయాలి. అలా రాస్తే చదువరులకు కొంచెం కష్టంగా వుంటుంది. చాల సంస్కృత శ్లోకాలు సంక్లిష్టమైనవి. మరొక ఉదాహరణ - విష్ణు సహస్రనామం పూర్వ స్తుతిలోని "క్షీరోదన్వత్ప్రదేశేశుచిమణివిలసత్సైకతేమౌక్తికైర్మండితాంగః.

    రిప్లయితొలగించండి
  3. సూర్యనారాయణ గారికి ధన్యవాదాలు...
    నేను కూడా ఎన్నో రోజులనుండి బంధనాన్ అని చదవాలా లేక బంధనాత్ అని చదవాలా?
    అనే సందేహం...మీ వివరణ వలన నా సందేహం తీరింది.
    ఉత్తమ ప్రశ్న అడిగిన తేజస్వి గారికి కూడా నా ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి